పాలన గాలికి.. ప్రభుత్వ కార్యాలయాల పైకప్పులు నేలకు!
కాటారం తహసీల్దార్ ఛాంబర్లో కూలిన సీలింగ్
తృటిలో తప్పిన ప్రాణాపాయం.. శిథిలావస్థలో ప్రభుత్వ భవనాలు
భూపాలపల్లి , అక్టోబర్ 14 (చక్రవాణి న్యూస్ ): ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణపై పాలకులకు ఎంత శ్రద్ధ ఉందో కాటారం తహసీల్దార్ కార్యాలయంలో కూలిన సీలింగ్ ఘటన అద్దం పడుతోంది. ప్రజలకు భరోసా కల్పించాల్సిన కార్యాలయాలే ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం తహసీల్దార్ ప్రధాన ఛాంబర్లో పైకప్పు పెచ్చులు ఊడిపడి, ఫ్యాన్‌తో సహా సీలింగ్ కంప్యూటర్లపై కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమా?
నిత్యం తహసీల్దార్ విధులు నిర్వహించే కుర్చీ, టేబుల్‌పైనే సీలింగ్ శిథిలాలు పడటం కార్యాలయ భవనం పరిస్థితికి అద్దం పడుతోంది. ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది గది తలుపులు తెరిచి ఈ దృశ్యాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. కార్యాలయ వేళల్లో ఈ ఘటన జరిగి ఉంటే ఉద్యోగులు లేదా వివిధ పనులపై వచ్చే ప్రజలు ప్రమాదంలో పడేవారని ఆందోళన వ్యక్తమవుతోంది.
మరమ్మతులు ఎప్పుడో.. ప్రమాదం జరిగాకేనా?
ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత కల్పించడం పాలనా యంత్రాంగం బాధ్యత. అయినప్పటికీ భవనాల నిర్వహణపై ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మండలంలోని పలు ప్రభుత్వ భవనాలు కూడా శిథిలావస్థకు చేరుతున్నాయన్న స్థానికుల ఆందోళన పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే భవనాల స్థితిగతులను పరిశీలించి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలి
కాటారం తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని తక్షణమే పరిశీలించి, ప్రమాదకర ప్రాంతాలకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల భద్రతపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరో ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించకముందే ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
